Monday, June 8, 2015

ఇషాని శతకం 1 - 10

**************************************************************************************************************************************











1.   సుంద రాంగి చూడ అందమై ఉండును

మనసు ముఖ్య మున్ను మాట కూడ

చక్క నైన కోడి కొక్కొరోమని కూసె

శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



2.   చదువు సంధ్య లెంత చక్కని విలువలొ

భక్తి భావ మంత రక్తి శక్తి

ఖాళి కుండ ఘయ్యి ఘయ్యని మోగదా

శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



3.   అంద మెల్ల చూసి చిందు లేయ తగదు

కోకి లమ్మ చూడ కాకి నలుపు

రెక్క పురుగు లెగిరి చిక్కు దీపము నందు

శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని


4.   తియ్య వన్ని తినుచు తృప్తి చెంద తగదు

ఉప్పు లేని పప్పు చప్పగుండు

ముక్కు వంకర చిలక ముద్దు ముద్దుగ పల్కు

శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



5.   ఇష్ట  మైన పనులు ఎవరి కైన సులువు

కష్ట మైన పనులు గొప్ప చేయ

గంట గంట నిలిచి కొంగ పట్టును చేప

శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



6.   కలిమి లేము లెపుడు కావడి కుండలు

సంప దుండు టెపుడు గొప్ప కాదు

వేయి కనుల నెమలి వేట గానికి చిక్కు

శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని


7.   తప్పు చేయ తప్పు, ఒప్పు చేయుట మెప్పు

తప్పు చేసి నంత కప్ప వలదు

చిన్ని కృష్ణ కూడ మన్ను గుప్పెను నోట

శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని


8.   ఒకటి రెండు చాలు చక్కని సంతతి

రెక్క పురుగు లీను లక్ష లక్ష

మొక్క జొన్న కుండు లెక్క లేని సుతులు

శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



9.   తల్లి తండ్రి తిట్లు దీవెన లుగ నెంచు

కష్ట మైన మాట గొంతు నుంచు

కంఠ మునను దాచె గరళ మును శివుడు

శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



10.   అద్భుతమ్ము నెపుడు ప్రధమ శ్రేణిని నుండ

  తగ్గి నప్పు డపుడు దిగులు తగదు

  చంద మామ మోము కుందేలు మచ్చుండు

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని






...Posted by Ishani

****************************************************************************************************************************

No comments:

Post a Comment