Monday, June 8, 2015

ఇషాని శతకం 41 - 50

***************************************************************************************************************************************












41.   పట్టు చీర గట్టి వడ్డాణ్యము బిగిచి

   పాడ ననుచు పాడు పసిడి బొమ్మ

   మనసు లోని వాంఛ మొహ మాటము గప్పు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



42.   గోవు పేడ దెచ్చి కాల్చి బూడిద జేసి

   ఫాల మునను రుద్దు పరమ శివుడు

   పనికి రాని వన్ని పార వేయ తగదు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



43.   చంద్ర గ్రహణ మొచ్చు నిండు పున్నమి నాడు

   కాళ రాత్రి( దీప వాళి వచ్చు

   చంద్ర కళలు నేర్పు చక్కని నీతులు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



44.   ఎలుక కలుగు లోకి వేల వేలను ఈడ్చు

   చెట్టు నీడ తిరుగు చుండు ఉడుత

   ఆశ గాడు లోభి, అల్ప సంతుషి యోగి

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



45.   కారు మబ్బు కమ్మి గర్జించు గ్రీష్మాన

   స్వాతి వాన కురియు చల్ల గాను

   మనుషు లందు భేద మీరీతి నుండును

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



46.   ఆకు లలము మేసి చాక లోడి గధము

   మూట వీపు మోసి ఏటి కరుగు

   రాజ భటులు ఇటులె దేశ సేవకులుర

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



47.   పాల రాతి గాంధి పలుకడు ఉలకడు

   నెత్తి నెక్కి పిట్ట రెట్ట వేయ


   కీర్తి శాశ్వ తమ్ము, మూర్తి అనిత్యము


   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



48.   సిల్కు చీర కట్టి చెవుల కమ్మలు పెట్టి

   మల్లె పూలు తెచ్చి మాల చుట్టి

   పెట్ట గలము జడలొ, పెంచ గలమె బుధ్ధి?

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



49.   కొయ్య గుఱ్ఱ మెక్కి గుండ్రాలు గొట్టుచు

   రంగు రాటముల్ దిరుంగు రీతి

   పగలు రాత్రి గడిచి పోవు చుండు మనకు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



50.    చింత చెట్టు నీడ చల్లగ నుండదు

   చింత బెత్త మెంతొ చురుకు గుండు

   చింత పండు లేక చారు పులుసు లేవు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని










...Posted by Ishani

****************************************************************************************************************************************************

No comments:

Post a Comment