Friday, June 17, 2016

నిరాదర్శవాది

***********************************************************************************************************************************


చిన్నతనం లో అందరు పిల్లలూ తప్పులు చేస్తూ ఉంటారు. అబధ్ధాలాడతారు. ఇది ప్రకృతి సహజం.

చిన్ని కృష్ణుడు వెన్న దొంగిలించేవాడు. మన్ను తినేవాడు. ఏమిరా మన్ను తిన్నావా అంటే లేదని బుకాయించేవాడు.

తాము ఎన్ని తప్పులు చేసినా పిల్లలు వాళ్ళ తలితండ్రులు తప్పులు చేస్తే సహించలేరు. క్షమించరు. ముఖ్యంగా పెద్దలు అబధ్ధాలు చెబితే పిల్లలు చిన్నబుచ్చుకుంటారు.

ఎందుకంటే పిల్లలు సహజంగా ఆదర్శవాదులు. ముఖ్యంగా తమ తండ్రులను తమ ఆదర్శంగా ఎన్నుకుంటారు.

నాకు ఊహ తెలిసినప్పట్నుంచీ మానాన్నగారు హెడ్మాస్టరు. అబధ్ధాలు అసలు చెప్పేవాడు కాదు. ఒక్క దురలవాటు కూడా ఆయనలో ఉండేది కాదు. పైగా లెఖ్ఖల్లో నా చిన్నప్పుడు ఆయన జీనియస్ అనుకునేవాణ్ణి. నాకు రాని లాభ నష్టాలవీ, కాలం-పనివీ ఆయన మనసులోనే చేసి చూపించేవాడు.

అందుకని మా నాన్నగారినే నేను ఆదర్శంగా ఎన్నుకున్నాను. కానీ నేను నాలుగో ఫారం లో చేరగానే కాంపోసిట్ మేథ్స్ తీసుకునే సరికి ఆయనకు ఆల్జీబ్రా రాదనీ, సైన్ 30 ఎంతో చెప్పలేరనీ గ్రహించి చాలా దు:ఖించాను. అది నా జీవితంలో నాకు జరిగిన ప్రధమ నిరాశ.

ఆపైన నేను కాలేజీ చదువులకు మా పెదనాన్నగారింట్లో చేరాను. ఆయన మా కాలేజీ ప్రిన్సిపాలు. నెల్లూరు షేక్స్పియరని పేరు పొందారు.  చాలా హుందాగా ఉండేవారు. రమణమహర్షి ప్రియ శిష్యుడు. ఆయన్నే నేను ఆదర్శంగా ఎన్నుకున్నాను.

కానీ ఒకరోజు ఆయన రిక్షా ఎక్కి విశాఖపట్నానికి పెద్ద పనిమీద బయల్దేరుతూంటే నాకు ఘట్టిగా తుమ్ము వచ్చింది. ఆపుకోలేక పోయాను. అప్పుడాయన రిక్షా దిగి ఇంట్లోకి వచ్చి కొంచెం విసుక్కొంటూ కొంచెం కసురుకొంటూ బాత్ రూములోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొనివచ్చి సీరియస్ గా ముఖం పెట్టి రిక్షా ఎక్కి వెళ్ళారు.

దాంతో నేను బాగా చిన్నపుచ్చుకున్నాను. అప్పటికి నాకు 14 ఏళ్ళు. 

ఆపైన నేను యూనివర్సిటీ లో గడిపిన 7 సంవత్సరాలలోనూ ఎంత వెదికినా నాకు ఆర్శంగా ఎవ్వరూ కనిపించలేదు.

అటు పిమ్మట నేను ఐఐటీ ఖరగ్పూరులో టీచర్ గా చేరాను. అప్పుడు నాకొక పీ హెచ్ డీ గైడు దొరికారు. నాకన్నా 30 ఏళ్ళు పెద్ద. నా జీవితంలో నేను సన్నిహితం గా చూసిన జీనియస్ ఆయన ఒక్కరే. ఇప్పటికీ. 

ఒక రోజు నేను వాళ్ళింటికి పనిమీద వెళ్ళినప్పుడు ఆయన దిగాలుగా సోఫాలో కూర్చుని చింతిస్తూ ఉండేవారు. కొన్ని నిముషాలకు ఆయన కళ్ళల్లో నీళ్ళు కుక్కుకుంటూ ఒక బెంగాలీ వారపత్రిక నాకు చూపించారు. అందులో ఎవరో ఒక లిస్టు తయారు చేసి ప్రచురించారు: బెంగాలులో ప్రముఖులైన 20 మంది అత్యద్భుత టీచర్లు.

ఆ వెఱ్ఱి లిస్టులో ఆయన పేరు లేదు. అదీ ఆయన దు:ఖానికి కారణం. నాలో నేను నవ్వుకొన్నాను. 

అప్పటికే నాకు 30 ఏళ్లు. ఆపైన నేను నాకు ఆదర్శంగా ఎవరినీ వెదకడం మానేశాను. దేహ ధారణ చేసిన ప్రతి వ్యక్తిలోనూ నాకు కనిపించే లోపం ఏదో ఒకటి ఉంటుందని గ్రహించాను.


కానీ ఈరోజుకీ పడుకునే ముందు "ఆరోజు ఆపని చెయ్యకుండా ఉంటే బాగుండేది. అప్పుడామాట అనకుండాఉంటే బాగుండేది. ఈరోజు ఈ ఆలోచన రాకుండా ఉంటే బాగుండేది" అని చింతిస్తూ పడుకుంటాను.


అప్పుడప్పుడూ నాలో నేను నవ్వుకుంటాను: 

"కాటికి కాళ్ళు జాచుకున్న నేను హాయిగా ఉండకుండా ఈ ఆలోచనలోతో సతమతమవడం ఎందుకో" అని.

బహుశా నాకింకా కుర్రతనం పోలేదేమో....




  ...Posted by Ishani

***************************************************************************************************************************************

No comments:

Post a Comment