******************************************************************************************************
స్వామి రమణ!
చిన్ననాటి నుండి చీత్కారములు సైచి
క్రుళ్ళుచుండ నేను, కూర్మి మీర
నన్ను చేరదీసి నాకు సాంత్వనమీయ
సన్నుతింతు నిన్ను స్వామి రమణ!
పోరు బెట్టి మిగుల పోట్లాడి కాట్లాడి
దాడిలోన తుదకు నోడిపోవ
నన్ను చేరదీసి నాకు బుద్ధిగఱప
సన్నుతింతు నిన్ను స్వామి రమణ!
పేరు ప్రతిభ కొఱకు వేసారి వేగుచు
చింతజేసి నేను వంతనొంద
నన్ను చేరదీసి నాలోన నిలువగ
సన్నుతింతు నిన్ను స్వామి రమణ!
యశము ధనము చేర్చి హాయిని కూర్చుండి
చితిని జూచి కడకు చితికి పోవ
నన్ను చేరదీసి నాకు సుధనిడగ
సన్నుతింతు నిన్ను స్వామి రమణ!
**********************************************************************************************************************************************
No comments:
Post a Comment