Monday, June 8, 2015

ఇషాని శతకం 61 - 70

***************************************************************************************************************************************












61.    వెదురు పూలు పూయు వందేళ్ళ కొకసారి

   వెదురు బొంగు లేని ఊరు లేదు

   కొలవ లేము విలువ వేల లక్షల కోట్ల

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



62.    కంద గడ్డ బద్ద అందమై ఉండును

   దిగగ గొంతు లోకి దురద పుట్టు

   రంగు రూపు రుచులు భంగు భంగుల నుండు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



63.    కంద పద్య మెంతొ అందమై ఉండును

   వచ్చు కళ్ళ నీళ్ళు వ్రాయ బోవ

   దిద్ది తీర్చి నటులె దూరపు కొండలు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



64.    పెరుగు చుక్క ఒకటి పాల జేయు పెరుగు

   పెరుగు పాల జేయ బ్రహ్మ తరము

   మనిషి ఇట్టె వ్యసన ముల లోయలో దూకు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



65.    ఉప్పు తక్కు వైన చప్ప గుండును పప్పు

   కొంచె మెక్కు వైన గూడ తినము

   మందు వాడ వలయు మోతాదు గనెపుడు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



66.    ఆవ గింజ చిన్న అన్ని గింజల కన్న

   ఆవ కాయ ఘాటు లావు గుండు

   ఆవ నూనె బాపు వ్యాధు లనేకము

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



67.    మల్లె మొగ్గ పూసి జల్లు సౌరభ మెల్ల

   రాలి పోవు వాడి, తల్లి నీడ

   మంచి మనిషి ఇటులె మేలు చేసి వెడలు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



68.    అప్పు చేయ తగదు ఎప్పు డంటె అపుడు

   తప్ప కుండ అప్పు తీర్చు త్వరగ

    నీరు పీల్చి మబ్బు నిలిచి వానగ జల్లు

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



69.     కాలు జారి నంత కట్టు గట్ట గలము

    నోరు జారి మాట మార్చ లేము

    నేల బడ్డ పండు ధూళి లోన గలయు

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



70.     మెప్పు పొందు టెపుడు గొప్పగ నుండును

    చెప్పు దెబ్బ కూడ చేయు మంచి

    తడిపి ఉతక చీర తళ తళ మెరియదె

     శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని













...Posted by Ishani

****************************************************************************************************************************************

No comments:

Post a Comment