Monday, June 8, 2015

ఇషాని శతకం 81 - 90

***********************************************************************************************************************************************













81.    రాము డొకడు తెచ్చె రఘు వంశమున శోభ

    కౌర వుండ్రు వంద కురుని కూల్చె

    గుణము వలన కలుగు ఘనత శాశ్వ తముగ

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



82.    కూర్చు నుండ సీత కోక చిలుక వాలు

    పరుగు లిడిన వెంట పారు పిచుక

    శాంత దాంత మునను సుఖము శుభము కల్గు

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



83.    అంతరిక్ష మందు ఎగురుచు తిరుగెడి

    గద్ద చూపు నుండు కోడి పిల్ల

    భక్తు మనసు నుండు భగవంతు డటులనె

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



84.    పులుసు లోన రాయి, పప్పు(  మిరప కాయి,

    కొట్టి చూడ కుళ్ళు కొబ్ర కాయి,

    కష్ట సుఖము లటులె కలిసి యుండు నిచట

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



85.    సప్త ఋషుల ననురు సప్త తారల నొకరు

    ఏడు చుక్క లనను రెలుగు బంటి

    చూడ బడ్డ దొకటె చెప్పు రీతులు వేరు

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



86.    లేత తమల పాకు లిటులె కరుగు నోట

    అడివి తమల నమల నర్ధ గంట

    జాతి ఒకటె మనిషి, రీతులు పది వేలు

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



87.    ఎచటి నుండి వచ్చె నెచటి కేగ గలమొ

    ఎరుగ లేము మనము ఎంత వెదక

    తెగిన గాలి పటము ఎగిరి కూలు నెచటొ

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



88.    ఆట వెలది సుళువు అన్ని పద్యము లందు

     తేట గీతి వినగ తియ్య గుండు

     సీస పద్య మంత భేషు పద్యము లేదు

     శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



89.     బొంగరమ్ము తిప్ప భళిగ తిరుగు చుండు

     అలసి సొలసి నంత ఆగి పడును

     మనసు ఆగి నంత మాయ మౌను నటులె

     శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



90.     పట్టు పాన్పు పైన పండ బెట్టిన పాప

    కళ్ళు తెరిచి నంత తల్లి నెదుకు

    బుధ్ధ దేవు డాయె సిధ్ధార్ధు డటులనె

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని








...Posted by Ishani

******************************************************************************************************************************************

No comments:

Post a Comment