Monday, June 8, 2015

ఇషాని శతకం 11 - 20

*************************************************************************************************************













11.   చిక్కు లొచ్చి నంత చింత జేయ దగదు

 ఒక్క క్షణము లోన మోక్ష ముండు

 రామ పాద ధూళి రాతి నాతిని చే సె

 శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



12.   కమ్మ గున్న వన్ని నమ్మ వలదు చిన్ని

 మొగలి పొదల దాగు నాగు పాము

 చేదు వేప ముద్ద చేయు చక్కని మేలు

 శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



13.   మంచి చెడ్డ లందు మరువ రాదు ప్రభుని

 గూటి రామ చిలక పాట పాడు

 పిల్లి జూసి నంత గోల పెట్టి ఎగురు

 శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



14.   కొత్త వింత మురుసి పాత రోత తగదు

 పాత చింత పచడి భేషుగుండు

 తాత పలుకు లెపుడు తియ్య తియ్యగ నుండు

 శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



15.   గాలి లేక కూలు గాలి పటము నేల

 కర్ణ రథము బురద గూరు కొనియె

 దైవ బలము లేని ధైర్యము విఫలము

 శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



16.   నీరు లేక మొక్క లారి పోవుచు నుండు

 తల్లి లేని పిల్ల తల్ల డిల్లు

 నిష్ఠ లేని పూజ నిష్ఫల మవుచుండు

 శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



17.   పరుల మాటలు విని పరుగులిడుట కన్న

 సొంత బుధ్ధి నమ్మ కొంత మేలు

 గూని మాటలు విని కైకేయి వగచెనే

 శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



18.   మంచి మాట లెపుడు మైత్రి భావము పెంచు

 దుడుకు తనము దెచ్చు దుఃఖ మెపుడు

 ద్రుపదు తనయ నవ్వి దుష్టుల కవ్వించె

 శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



19.   విజయ అప జయములు విధి వ్రాతలకు లొంగు

 ఆట లెపుడు గెల్వ మాట కాదు

 అర్జు నుండు కూడ కొజ్జ రూపము దాల్చె

 శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



20.    చిన్న దాన్ని చూడ చిన్న చూపు వలదు

  చిన్న చీమ కుట్ట చెంప నొచ్చు

  బొజ్జ విఘ్న రాజు బుజ్జి ఎలుక నెక్కు

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని







...Posted by Ishani

*************************************************************************************************************

No comments: