***************************************************************************************************
కంది శంకరయ్య గారి సప్తతి 17 July 2020
సరదా శంకరాభరణం:
1957 లో నేను SSLC పరీక్షకు కూచొని రిజిస్టరు రాగానే విప్పి చూశాను:
తెలుగు: 51; ఇంగ్లీషు: 85.
అప్పటినుంచీ తెలుగుపై విరక్తి...
ఈశ్వరేచ్ఛగా ఆ తరువాత 60 సంవత్సరాలు చదవడం, పాఠాలు చెప్పడం, మాట్లాడడం, ఆలోచించడం అంతా ఆంగ్లంలోనే.
నాలుగేండ్ల క్రితం ఒక రోజు చిన్నప్పుడు విని విస్తుపోయిన "లలనా జనాపాంగ" అనే పద్యం వదలకుండా మనస్సులో మెదలడం వలన గూగులమ్మనడిగితే వెంఠనే ఈ సైటు చూపించినది:
దానిలో ఆ పద్యానికి ఎవరో ఒక "కంది శంకరయ్య" అనే మాస్టారు వ్రాసిన ప్రతిపదార్థం, తాత్పర్యం కనిపించినవి. ఇట్లాంటి తెలుగు పండితుడే నాకు గురువై ఉంటే నేను కూడా ఆ మ్లేచ్ఛభాష విడిచి మాతృభాష మాస్టారయి ఉండేవాడినని అనుకున్నాను మనసులో.
అప్పటినుండీ తెలుగు పద్యం ఒకటి నేను కూడా వ్రాయాలని అనుకొని గూగులమ్మ దయతో కంద పద్యం ఛందస్సు నేర్చుకొన్నాను ఆషామాషీగా.
మరలా ఈశ్వరేచ్ఛవలన గూగులులో "శంకరాభరణం" కనిపించినది. వెంటనే సరదాగా "షేరు బజారు" అన్న పదముతో (తెలుగు రాదు కదా అప్పుడూ ఇప్పుడూ) ఒక కంద పద్య పూరణను పంపించాను. దానికి వచ్చిన స్పందన:
"శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీ పూరణ బాగున్నది"
రెండేండ్ల తరువాత సారును దబాయించాను: "ఆ నా పద్యంలో యతి తప్పినది కదా?" అని. వారి స్పందన:
"మొదటి పూరణలోనే తప్పులు చూపిస్తే మొదటికే మోసం అవుతుంది కదా"
అదీ సంగతి. ఆ ఒక్క వాక్యమే శంకరాభరణం దిగ్విజయంగా పది సంవత్సరాలు దేదీప్యమానంగా వెలగడంలో బ్రహ్మరహస్యం.
ఈ పెద్ద మనిషిని ఎలాగైనా ఒక సారి చూచి స్నేహం చేసుకోవాలని వారి నెలవుకు నా డొక్కు కారులో వెళ్ళాను పని కట్టుకొని. ఆ గంట సేపు మాటలలో తెలిసినది కంది శంకరయ్య గారు బహు సరదా మనిషి అని.
ఆ పై విజృంభించి శంకరాభరణం సర్కసులో బఫూనుగా అప్పటినుండీ ఇప్పటి వరకు పాతవీ క్రొత్తవీ కలిపి ఐదువేల పైచిలుకు సరదా పూరణలు చేయడం జరిగినది. వాటిలో నూట పదహారిటిని ఎన్నుకొని నా ప్రమేయం లేకుండా వారే నా పేరుతో "శంకరాభరణం సమస్యలు: సరదా పూరణలు" అనే చిన్న పుస్తకం (అరసున్నలతో సహా) ప్రచురించారు.
గత మూడేండ్లలో దాదాపు పదిహేను సార్లు వారిని కలవడం జరిగినది. దీనికి నానుంచి ప్రోద్బలం ఈ నా మనోగతం:
"భారతావనిలో పుట్టి భగవద్గీత, కొద్దిగా ఉపనిషత్తులూ చదివి, డెబ్భై ఐదేండ్లు నిండుతూ కనులారా ఒక్క సాధుపుంగవుడినీ చూడలేక పోయానే" అన్న కొరవ. అది రెండేండ్ల క్రితం తీరినది.
కంది శంకరయ్య గారు కర్మయోగి.
వారికీ నాలాటి సరదా ముదుసలిని చూడడం ఇష్టమేనని వారి ఈ పద్యం చెబుతోంది:
************************************
ఇస్త్రీ సుంతయు నలుగని
వస్త్రంబుల దాల్చి సభకు వచ్చెను కవితా
మేస్త్రి సరదా ప్రభాకర
శాస్త్రియె మొన్న కలిగించె సంతస మెంతో!
(కవితా మేస్త్రి... దుష్టసమాసమే సుమా!)
**************************************
(మనలో మాట): సారుకు పాలకోవాలంటే మహా ఇష్టం:
"సార్! ఇవిగో డజను పాలకోవాలు...మీకూ, మీ ఆశ్రమ మిత్రులకూ"
"ఆశ్రమం చేరేసరికి ఒక్కటైనా మిగిలితే కదా!"
***************************************
"శతమానం భవతి శంకరార్యా!"
***************************************