Monday, June 8, 2015

ఇషాని శతకం 91 - 100

******************************************************************************************************************************************













91.    తాటి పండు, తేగ, తాటి ముంజలు, కల్లు,

    తాటి ఆకు, బద్ద, తాటి తోపు,

    తాటి చెట్టు గొప్ప, తాటి నీడలు తప్ప

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



92.    మణులు మాణిక్యాలు ముత్యాలు పగడాలు

    రత్న పచ్చ నీల రాళ్ళ ఖనులు

    సాటి రావు చిన్ననాటి స్మృ తు లకుర

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



93.    ధనము పంచు కున్న దార సుతుల కన్న

    ఘనత పంచు కున్న ఘనుల కన్న

    కలత పంచు కున్న కోడలు మిన్నయౌ

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



94.    అర్ధ చంద్రు డొచ్చె అష్టమి రాత్రిన

     చంటి పాప నవ్వె చిన్న నవ్వు
    
     అలసి సొలసె తాత అర శతకము రాసి

     శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



95.    పుట్ట లోన పాము గుట్టు చుప్పుగ నుండు

    గూటి లోన దాగు గుడ్ల గూబ

    రాత్రి పగలు రచ్చ రాజ కీయులు చేయు

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



96.    పచ్చి జామ కాయ తెచ్చి బుట్టను బెట్ట

    మూడు రోజు లందు మగ్గి పోవు

    మూర్ఖు నెంత మొట్ట మూర్ఖుడై ఉండడె

     శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



97.    చెట్టు నీడ పుట్టు పుట్ట గొడుగు లన్ని

    ఆవు కింద దాగు ఆవు దూడ

    భక్తు డెపుడు కోరు భగవాను శరణము

     శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



98.    పంచదార చిలక పంటి కింపుగ నుండు

    పాట పాడ మనిన మాట రాదు

    జపము తపము చేయ జడుడు ధీరుడవునె

     శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



99.    గుళ్ళు గోపు రాల గర్భ గృహాలలొ

    వెలసి యున్న విష్ణు వెంకటాద్రి

    హృదిని దాగి యున్నహరి హర రూపమౌ

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని





100.      ముద్దు బిడ్డ నీవు ము సిలి మూర్ఖుడ నేను

        చెప్ప గలను కాని చేయ లేను


        చదువు కొనవె నాదు శతక మిదుగొ నీదు


        శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని







...Posted by Ishani

**********************************************************************************************************************************************

No comments: