Monday, June 13, 2016

నేపధ్యంలో పథ్యం

***************************************************************************************************************************



ఇది మా అమ్మమ్మ కథ. ఈకథలో ఆమే హీరోయిను.


గత శతాబ్దం వృత్తాంతాలు.


నా అంచనా ప్రకారం అమ్మమ్మ జన్మ 1905 లో. ఆ కాలం లో తెలుగు సంవత్సరాలూ

తెలుగు తిథులూ…ప్రభవ విభవ లాటివి. ఆ అరవై మేము వల్లించే వాళ్ళం.
  
మామనవరాలికివేవీ తెలీవు. ఆమె మమ్మీ డాడీ జాకూ జిల్లూ తరం.


నాకు ఊహ తెలిసే సరికి 1950 లో అమ్మమ్మ తో తొలి పరిచయం. మహా ఠీవి మనిషి.

దొరలప్రభుత్వం లో మా తాత గారు రెవిన్యూ ఆఫీసరు. అమ్మమ్మ ద్వారా వినిన 

పదాలు: ఇఛ్ఛాపురం, బరంపురం,  ఛత్రపురం, విశాఖపట్నం, గోదావరి, పాపికొండలు,

 చిరుతపులులూ, కాటన్ దొర, వడ్డాణ్యం, లక్ష్మీకాసులూ, చామంతి బిళ్ళ, చంద్రహారం,

నాగరం, మొగలి దండలూ. ఇవన్నీనాకు విచిత్రంగా ఉండేవి.


ఆమె పసిడి వన్నె ఎడంచేతి మీద నల్లగా నీలంగా ఉండే ఒక తేలు బొమ్మను చూసి

అదేమిటి అని అడిగాను. పచ్చ అని చెప్పింది. ఎందుకు అన్నాను. అది ఫ్యాషను

అంది. ఎలా అన్నాను. సూదులతో పొడిపించుకున్నానంది. నేను మరి రెండు రోజులు

మాట్లాడలేదు. భయం వేసింది…అమెనూ ఆమె పచ్చనూ చూసి. పచ్చల ఫ్యాషను

మారిందనుకుంటా. మా అమ్మ కాని నా భార్య కాని పచ్చలు పొడిపించుకోలేదు. ఈరోజు

మళ్ళీ మా మనవరాలు పురమాయించింది: 


'తాతా  పాముల ట్యాటూలు మూడు కొనుక్కొరా' 



ప్రతి వేసంగి శలవల్లో అమ్మమ్మ మా ముత్తుకూరు వచ్చేది. ఆమె ఉన్న నెలసరి మాకు

ప్రతిరోజూ పండుగ. తెల్లవారి లేచి వేడి వేడి అన్నం వండి గిన్నె పక్కన పెట్టుకొని మా

ఆరుగురు పిల్లల్నీ అర్ధవృత్తాకారంగా ఆమె చుట్టూ కూచోబెట్టి చేతులు జాపించి ముద్దలు

చేసి పెట్టేది. అన్నంతో పాటు ఆవకాయో ఉల్లికారమో. దండిగా నెయ్యి. ఆమె చేసిన

పెద్దపెద్ద ముద్దలను ‘అమ్మమ్మ ముద్దలు’ అనేవాళ్ళం. పేకాటలో ముక్కల్లాగా ఆరు

చేతుల్లో ముద్దలు గబగబా పంచేది. మళ్ళీ మావంతు వచ్చేసరికి చెయ్యి ఖాళీగా

ఉండాలి. అదీ పందెం. ఐదు ముద్దలతో మాపని అయిపోయేది. ఇక లేచి పరుగులే. మళ్ళీ

మధ్యాన్నం వరకూ ఆటలే.


అమ్మమ్మ ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ వంటగదిని ఆక్రమించి కూతుళ్ళకూ కోడళ్ళకూ

కూరలు తరిగే పని మాత్రం ఒప్పచెప్పేది. ఉప్పూ కారం ఆధిపత్యం తనదే.


పదేళ్ళ తర్వాత నేను యూనివర్సిటీ చదువుల కోసం విశాఖపట్నంలో మా మేనమామ

గారింట్లో చేరాను. అప్పుడు అమ్మమ్మ అక్కడ సామ్రాజ్యం చేస్తూ ఉండేది కొన్నాళ్ళు.

ప్రతి రోజూ ఉదయం ఎనిమిదిమ్ముప్పావు కాగానే కంచం పట్టుకొని వంటింట్లో నేలమీద

తిష్ఠవేసేవాణ్ణి. తొమ్మిదింపావు బస్సు అందుకోడానికి. అది మిస్సయితే నాలుగు మైళ్ళు

నడిచి వెళ్ళాలి. అందుకని.


అమ్మమ్మ అప్పటికే పరుగులు పెడుతూ వంటలో నిమగ్నం అయేది. వరుసగా

అవుతున్న సాధకాలు కూర, పులుసు, నా కంచంలో వడ్డించేది. నేను గబగబా

గతుకుతూంటే రోజూ అడిగేది:


“ఉప్పూ కారం సరిపోయాయా?”


“బ్రహ్మాండంగా ఉన్నాయి”


“ఏమో రోజూ అట్లే అంటావు. నీకు రుచీ పచీ తెలిస్తేనా. దిగమింగడం తప్ప”


పరుగులు పెట్టే నాకు రుచులు చూసే తీరిక ఎక్కడుండె.


రోజూ ఆమె వ్యాఖ్యలు భరించలేక ఒక రోజు నిజం చెప్పాను:


“కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది”


“ఉప్పెక్కువైందా! నీ మొహం! మీ గుఱ్ఱం వాళ్ళకి ఉడకేసిన గుగ్గిళ్ళు తప్ప మరేమీ

నచ్చవు. ఉప్పు ఎక్కువట! ఉప్పు లేని కూడు చప్పగుండదా?  తిక్కలోడా!”


అదీ ఆమె తంతు. నోరు మూసినా తప్పే నోరు తెరిచినా తప్పే! కానీ నిజం చెప్పాలంటే

అమ్మమ్మ వంటలు అద్భుతంగా ఉండేవి...ఉప్పు తప్ప.


మరో పదేళ్ళ తరువాత అమ్మమ్మా తాతగారూ నెల్లూరులో వాళ్ళ స్వగృహంలో

స్థిరపడ్డారు. ఆపైన రోజూ మనవళ్ళూ మనవరాళ్ళ తో పదికి తక్కువ లేకుండా విస్తళ్ళు

లేచేవి అమ్మమ్మింట్లో.


ఒకరోజు ఆమె కుమారుడు (అదే మా డాక్టరు మేనమామ) విశాఖపట్నం నుంచి వస్తూ

సరికొత్త బీపీ యంత్రం తెచ్చి అందరికీ బీపీ చూడడం ఆరంభించాడు. అమ్మమ్మ వంతు

రాగానే ఆశ్చర్య పోయాడు. 220/150. నాలుగు సార్లు చెక్ చేసిన తర్వాత ఇలా

అన్నాడు:


"అమ్మా! ఇక నువ్వు ఉప్పు పూర్తిగా మానెయ్యాలి. లేకపోతే పక్షవాతంతో మంచం పడతావు.

నీవంటలు కట్టిపెట్టి వంటమనిషిని పట్టుకో!”


ఆబెదిరింపుకు నవ్వి ఆమె సరేలే నీ ఇష్టం అంది. మరు సంవత్సరం నేను అమ్మమ్మ

ఇంటికి వచ్చినప్పటికి ఆమెకు నచ్చిన వంట మనిషి ఉండేది. ఆమె వంటమనిషికి

అందరూ వినేట్లుగా ఇలా గట్టిగా పబ్లికుగా పురమాయించేది:


"సీతమ్మా! ఉప్పు పూర్తిగా తగ్గించి వెయ్యి. ఉప్పెక్కువ తింటే రుచి కమ్మగుంటుంది కానీ

పక్షవాతం వస్తుంది"


అని నాలుగు సార్లు గుర్తు చేసేది. ఇక ఆ చప్పటి వంట మాపరం అయేది. తప్పదు కాబట్టి

మేం గుట్టుగా తినే వాళ్లం. ఒకరోజు మా అమ్మతో నేనిలా అన్నాను:


"అమ్మమ్మ నిజంగా చాలా మారింది. ఆరోగ్యం ఐశ్వర్యం అని గ్రహించింది"


అప్పుడామె ఫక్కున నవ్వి ఇలా అంది:


"ఓహో! ఆమె సంగతి నీకు తెలీదులే. పిల్లలూ తల్లులూ అందరి భోజనం

అయింతర్వాత ఆమె, సీతమ్మా ఎదురెదురుగా వంటింట్లో కంచాలు పెట్టుకొని కబుర్లు

చెప్పుకుంటూ 'ఛీ ఉప్పు లేని కూడు తినేదెలా...ఆ ఉప్పు డబ్బా ఇటుతే' అనుకుంటూ

చెరో పిడికెడు ఉప్పు కంచంలో వేసుకునే వాళ్ళు"


అదీ మా అమ్మమ్మ పథ్యం!


అలా ఇంకో పదేళ్ళు గడిపి ఏజబ్బూ లేకుండా భర్తకు సేవజేసి సాగనంపి మంచాన

పడకుండా ఒక రోజు స్వర్గం చేరుకుంది.


మరి ఈకాలం ఆమె మునిమనవళ్ళు ముప్ఫై నిండకుండా సుగరూ బీపీ అసిడిటీ

కొలెస్టరాలూ లివరూ హార్టూ అనుకుంటూ ఆరు నెలలకొక సారి స్కానులు

చేయించుకుంటూ పథ్యం చేస్తూ బాధలు పడుతున్నారుగా!


అమ్మమ్మలు జిందాబాద్!











...Posted by Ishani

***********************************************************************************************************************

No comments: